Wednesday, March 29, 2017

UGADHI


తొలి విగ్రహం... తొలి పండుగ
రోజు ఉగాది పండుగ... త్వరగా లేచి తలంటుకుని కొత్తబట్టలు వేసుకో అంటూ చింటూను నిద్రలేపింది వాళ్లమ్మ. చింటూ తయారయ్యేలోపు ఆమె వంటింట్లోంచి ఆరు రుచులతో చేసిన ఉగాది పచ్చడి తెచ్చి అందరికీ పెడుతోంది. పచ్చడి గిన్నె తీసుకుని చింటూ మామిడాకుల తోరణాలను గుమ్మాలకు కడుతున్న తాతయ్య దగ్గరకు వెళ్లాడు.
‘తాతయ్యా... కొత్త ఏడాది జనవరిలోనే వచ్చిందిగా. మరి ఉగాది కూడా ఎలా కొత్త సంవత్సరం?’ అంటూ ముద్దుముద్దుగా అడిగాడు చింటూ. 
‘భలే ప్రశ్నే అడిగావు ఓపిగ్గా కూర్చుంటే సంగతంతా చెబుతా’ అంటూ మొదలుపెట్టాడు తాతయ్య.. 
‘ఆంగ్లంలో నెలల పేర్లు చెప్పమంటే జనవరి నుంచి డిసెంబరు వరకు చెబుతావుగా. అలాగే తెలుగు నెలలు వేరే ఉన్నాయి. చైత్రం నుంచి ఫాల్గుణం వరకు. కాలాన్ని కొలవడంలో వేర్వేరు పద్ధతుల్ని ఉపయోగించడం వల్లే ఈ తేడాలు. సూర్యుని గమనం ఆధారంగా సౌరమానం, చంద్రుడి గమనం ఆధారంగా చాంద్రమానం వాడుకలో ఉన్నాయి. చాంద్రమానం ప్రకారం తెలుగు నెలల్లో చివరిదైన ఫాల్గుణ మాసం పూర్తయ్యాక తిరిగి చైత్రమాసం మొదలవుతుంది. ఆ తొలిరోజునే ‘ఉగాది’గా చెబుతామన్నమాట.’
చింటూ ఆసక్తిగా వింటుంటే... తాతయ్య కొనసాగించాడు.
‘ఉగాది’ అన్న పదం యుగ ఆది నుంచి వచ్చింది. అంటే యుగం ప్రారంభమయ్యే రోజని అర్థం.
పురాణాల ప్రకారం చూస్తే బ్రహ్మదేవుడు ఇదే రోజున విశ్వాన్ని సృష్టించాడని నమ్ముతారు. దీనిపై మరో ఆసక్తికరమైన పురాణ కథ కూడా ఉంది. విష్ణుమూర్తి నాభిలోంచి పెరిగిన కమలం నుంచి బ్రహ్మ పుట్టాడట. సృష్టిబాధ్యత స్వీకరించిన బ్రహ్మ తనతో పాటు నిత్యం ఉండమని విష్ణువును కోరాడట. అప్పుడు విష్ణువు పాలకడలిలో శేషతల్పంపై పడుకున్నట్టున్న తన విగ్రహాన్ని బ్రహ్మకు ఇచ్చాడట. ఇదే దేవుని మొదటి విగ్రహమని అంటారు. దాన్ని ఆరాధిస్తూ సృష్టి పూర్తిచేసిన బ్రహ్మ, ఆ తర్వాత దాన్ని సూర్యుడికి ఇచ్చేశాడు. ఆ విగ్రహాన్ని సూర్యుడు తన కొడుకైన మనువుకూ, మనువు తన కొడుకైన ఇక్ష్వాకుడికీ ఇచ్చారు. అలా అదే వంశంలో పుట్టిన శ్రీరాముడు కూడా ఈ విగ్రహాన్ని ఆరాధించాడు. ఆపై విభీషణుడు అడిగితే రాముడు దాన్ని ఇచ్చేశాడు. అయితే లంకకు తీసుకెళ్లే దారిలో విభీషణుడు దాన్ని పొరపాటున నేలపై ఉంచడంతో అది అక్కడే పాతుకుపోయిందిట. ఆ ప్రదేశమే తమిళనాడులోని శ్రీరంగం అనీ, ఆ విగ్రహం శ్రీరంగనాథస్వామిదనీ చెబుతారు. ఈ సంఘటన ఉగాదినాడే సంభవించిందంటారు. ఇలా మన కొత్త సంవత్సరం వెనక ఆకట్టుకునే పురాణగాథలున్నాయి అంటూ తాతయ్య చెప్పడం ముగించాడు.
ఇంతలో మామయ్య వస్తే చింటూ అక్కడికి పరుగెత్తుకెళ్లి పచ్చడి అందించాడు. ‘మామయ్యా! పోయిన ఏడాది నువ్వు బెంగళూరులో ఉన్నావుగా అప్పుడు ఉగాది పచ్చడి తినలేదు కదూ’ అన్నాడు చింటూ. 
దానికి మామయ్య బదులిస్తూ ‘ఉగాదిని మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... కర్ణాటకలోనూ చేసుకుంటారు. ఇంకా కశ్మీర్‌, మహారాష్ట్ర, మణిపూర్‌, సింధీ ప్రజలకు కూడా ఉగాది పండగే. ఈరోజునే కశ్మీర్‌లో ‘నవ్‌రెహ్‌’ పేరుతో పండుగ చేసుకుంటారు. మహారాష్ట్రలో ఈ పండగనే ‘గుడిపడ్వా’ అంటారు. సింధీ ప్రజలైతే ఉగాదినే ‘చేత చాంద్‌’అని పిలుస్తారు. మిగతా ప్రాంతాల కన్నా మన తెలుగు రాష్ట్రాల్లో భలేగా తెలుగుదనం ఉట్టిపడేలా ఉగాదిని జరుపుకుంటాం. సాంస్కృతిక కార్యక్రమాలు, కవిసమ్మేళనం లాంటివి ఇంకా పంచాంగ శ్రవణం ఇవన్నీ ఉంటాయి. సాయంత్రం నిన్నూ తీసుకెళ్తాలే అని చెప్పాడు.
భలే భలే అంటూ గెంతులేసుకుంటూ ఈ సంగ‌తుల్ని స్నేహితులకు చెప్పడానికి పరుగులు తీశాడు చింటూ...

Monday, March 27, 2017

Siva Kesava


శివకేశవులు ఒకేచోట..!
రాణీరుద్రమ దేవగిరి రాజు మహాదేవుడితో చేసిన భీకర యుద్ధం ఓ చారిత్రక ఘట్టం. లక్షల మంది సైన్యంతో ఓరుగల్లుపై దండెత్తిన మహాదేవుడితో పదిరోజుల పాటు ప్రత్యక్షంగా పోరాడి, అతడ్ని మట్టి కరపించింది రుద్రమ. ఆ అపూర్వ విజయానికి గుర్తుగా రుద్రమ నిర్మించిన దేవాలయమే వాంకిడిలోని శివకేశవాలయం.
ణపతి దేవుని తర్వాత పాలనా పగ్గాలు చేపట్టిన రుద్రమకు వీరనారిగా, అపరకాళికగా అంత ఖ్యాతి రావడానికి కారణం ఆమె పదే పదే ఎదుర్కొన్న యుద్ధాలే. స్త్రీ రాజ్యాధికారం చేపట్టిందన్న వార్త వినగానే సామంత రాజులంతా ఒకరితర్వాత ఒకరు తిరుగుబాట్లు మొదలు పెట్టారు. దండయాత్రలకు వరుస కట్టారు. తిరుగుబాటును తొక్కిపట్టడంలోనూ, దండయాత్రలను తిప్పికొట్టడంలోనూ రుద్రమకు రుద్రమే సాటి అనిపించేది ఆమె తీరు. కాకతీయ రాజుల్లో అగ్రగణ్యుడూ, తనకు తండ్రీ అయిన గణపతిదేవుని నుంచి 1262 సంవత్సరంలో రాజ్యాధికారాన్ని చేపట్టింది రుద్రమ. అప్పటి నుంచి 1289 వరకు - అంటే 27 ఏళ్లపాటు అప్రతిహతంగా పరిపాలన కొనసాగించింది. ఆమె పాలనా కాలంలో ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నా మరాఠా యాదవ రాజు మహాదేవునితో చేసిన యుద్ధం, దానికి సంబంధించిన విజయం చరిత్రలో లిఖించేంత గొప్పవి. సువిశాల కాకతీయ సామ్రాజ్యం మహిళ చేతుల్లోకి వచ్చిందనే వార్త వినగానే దేవగిరి రాజు మహాదేవుడికి ఏ తాళాలూ లేని బంగారు నిధి కనిపించినట్టయింది. గణపతిదేవుడి కాలం నుంచీ మాటిమాటికీ కాకతీయ సామ్రాజ్యం మీద దండయాత్రలు చేసే అలవాటున్న మహాదేవుడు ఈ సారి లక్షల సైన్యంతో ఓరుగల్లును చుట్టుముట్టాడు. కానీ రుద్రమ వెరవలేదు. దెబ్బతిన్న సింహంలా పోరాడింది. పదిరోజుల భీకర యుద్ధంలో ఆ సైన్యాన్ని తరిమి తరిమి కొట్టింది. ఆ రాజును వశపరచుకొని మూడుకోట్ల బంగారు వరహాలు పరిహారంగా కట్టించుకొని శత్రురాజ్యపు ఆర్థిక వెన్నును విరిచి మళ్లీ తిరగబడకుండా అణచివేసింది. చిన్న విజయమా అది... అందుకే యుద్ధం జరిగిన ప్రాంతమంతా - అంటే మరాఠా ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్‌, ప్రస్తుత తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాంకిడి వరకూ వూరూరా తన విజయానికి గుర్తుగా గుళ్లు కట్టించింది. అందులో వాంకిడిలోని శివకేశవాలయమూ ఒకటి. వందల ఏళ్లలో మిగిలిన ఆలయాలన్నీ కాలగర్భంలో కలసిపోగా ఇది ఒక చారిత్రక సాక్ష్యంగా దర్శనమిస్తుంది.
మరో వెయ్యి స్తంభాలగుడి... 
కుమురం భీం జిల్లా వాంకిడి మండల కేంద్రంలో ఉన్న ఈ దేవాలయంలో శివుడూ, విష్ణుమూర్తీ కొలువై ఉన్నారు. అందుకే దీన్ని శివకేశవాలయంగా పిలుస్తారు. ఇది అక్కడ ప్రవహించే చిక్లీ వాగు ఒడ్డున ఉంది. హన్మకొండలోని వేయి స్తంభాల గుడిని పోలి ఉంటుంది ఈ ఆలయ నిర్మాణం. అక్కడి గుడి ముందు ఉన్న నంది విగ్రహంలాగా ఈ ఆలయం ముందు కూడా నంది విగ్రహం ఉండడమేకాక, ఆలయంలోని స్తంభాలూ వేయి స్తంభాల గుడిలో ఉన్న స్తంభాలను పోలి ఉన్నాయి. గుడిలో శివ, కేశవులతో పాటు పోచమ్మ విగ్రహమూ ఉంది. గర్భగుడిలో ఉండే బావి నుంచి సొరంగ మార్గం ఉండేదట. అయితే భక్తులు పూజ చేసే సమయంలో ఈ బావిలో పడిపోవటంతో బావిని మూసి వేశారని పూర్వికులు చెబుతుంటారు. ఆలయానికి నాలుగు దిక్కులా ద్వారాలుండేవట. ముందు ద్వారం మాత్రమే ఇప్పుడు బాగుంది, మిగిలినవి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆలయ స్తంభాల రాళ్లను అప్పట్లో ఏనుగుల సాయంతో ఓరుగల్లు ప్రాంతం నుంచి తీసుకొచ్చి నిర్మాణానికి వాడినట్లు చరిత్రను బట్టి తెలుస్తోంది.
పునర్నిర్మాణం... 
ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్థులు రూ.40 లక్షల వ్యయంతో దీన్ని పునర్నిర్మించారు. చిక్లీ నది ప్రవాహం వల్ల ఆలయం కోతకు గురికాకుండా చుట్టూ భారీ ప్రహరీని నిర్మించారు. గుడి వెలుపల నవగ్రహాలూ, వినాయకుడి విగ్రహాలను ప్రతిష్ఠించారు. కోవెలలో నిత్య దీపారాధన జరుగుతుంది. శ్రావణ, కార్తిక మాసాలూ, శివరాత్రి రోజుల్లో ప్రత్యేక పూజలు జరుపుతారు. మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం ఐదుగంటలకు ఉత్సవ విగ్రహాలను పల్లకిలో వూరేగిస్తారు. భజన కార్యక్రమాలతో వూరేగింపుగా దేవతలను తీసుకువచ్చి చిక్లీ నదితీరంలో రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రథం తాడును లాగితే శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అందుకే వందల మంది ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ఇక్కడికి తెలుగు రాష్ట్రాల నుంచే కాక మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున వస్తారు.
ఆలయానికి ఇలా వెళ్లాలి... 
ఈ ఆలయానికి వెళ్లాలంటే కాజీపేట, దిల్లీ రైలు మార్గంలో రెండు స్టేషన్లు ఉన్నాయి. ఒకటి కాగజ్‌నగర్‌, రెండోది ఆసిఫాబాద్‌ రోడ్డు(రెబ్బెన). ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో వెళితే కాగజ్‌నగర్‌లో దిగాలి. ప్యాసింజర్‌ రైళ్లైతే ఆసిఫాబాద్‌రోడ్డులో దిగాల్సి ఉంటుంది. కాగజ్‌నగర్‌ నుంచి వాంకిడి వరకు 45 కిలోమీటర్ల దూరం, ఆసిఫాబాద్‌ నుంచి అయితే 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రెండు స్టేషన్ల నుంచి ప్రతి అరగంటకూ ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి.
- ఇ.సుదర్శనగౌడు, ఈనాడు, ఆదిలాబాద్‌ 
చిత్రాలు: ఎన్‌.వెంకటేశ్వరరావు